31, జనవరి 2009, శనివారం

నవరసాలు - శాంతం




నిప్పులు కురుసెడి కన్నులు
చప్పున మండెడి పలుకుల చపలగు భార్యా
అప్పుడు తప్పులు పట్టక
తప్పించుకు తిరిగి చూడు తగువులు మాయం

తనతో సరసము లాడుతు
తనచే కుడితికి మధువును తగదని పేల్చీ
తనవారు ఘనులని తెలుపు
మనకిట శాంతము దొరుకును మాపుకి మోక్షం

8 కామెంట్‌లు:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

యతి మైత్రి కూడ పాటించటానికి ప్రయత్నించండి.
బేసి గణాలలో జగణము రాకుండా చూడండి.

"తనవారు ఘనులని తెల్ప" - 3వ గణము జగణము అయినది.
"తనవంటనబ్బా యనియని తినుచు త్రేన్చీ" - 2వ గణము యగణము అవుతుంది.
"చె - చం ; త - తి " యతి మైత్రి లేదు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆటవెలది:-
జిగురు సత్యనార్య చెప్పిన యట్టుల
జగణ నియతి కనుము. చక్కగాను.
అచ్చు మైత్రి గొలిపి యలర జేయుము యతి..
కంద పద్య మపుడె యందగించు.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

సత్యనారాయణగారికి, రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు. తప్పులు తెలుసుకున్నాను. సరిదిద్దుకుంటాను. సమయాన్ని వెచ్చించి నన్ను సరి అయిన దారిన నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక తప్పులు లేవు అనుకుంటే తప్ప మరో పద్యం ప్రచురించను.

పుష్యం చెప్పారు...

@ఆత్రేయ,

తప్పులున్నాయని వ్రాయటం గాని, ప్రచురించడం గాని మానకండి. తెలిసిన తప్పులు దిద్దుకుంటూ, కొత్తవి నేర్చుకుంటూ ముందుకు సాగడమే విజయ రహస్యం :-)

కం//
బుడిబుడి నడకల పిల్లలు
పడిలేస్తూ నేర్చి నటుల వదలక మీరూ
జడవకిక మొదలు పెట్టుము
గడగడమని చెప్పగలరు కందము త్వరలో!!

ఆత్రేయ కొండూరు చెప్పారు...

మాటలు చెప్పిన సులువుగ
పాటగ కందము నుడివెడి పాటవమెరిగీ
పాఠము జెప్పిన తమరికి
సాటెవరు? తమది నిజముగ సాధన పుష్యం !!

ఆత్రేయ కొండూరు చెప్పారు...

తప్పులు దిద్దుకున్నాను పరికించగలరు.

పుష్యం చెప్పారు...

@ఆత్రేయా,

మీకు కందం బాగా పట్టుబడింది. ఇక దున్నేసుకోండి :-)

కం//
చేసితిరి మంచి యత్నము
వ్రాసితిరి కందములవి రమణీయంగా
చూసారా ఎంత సులువొ
ప్రాస మరియు యతులు కూర్చి పద్యములల్లన్!!

పుష్యం చెప్పారు...

గణములు తప్పినవి..'వ్రాసితిరి కందములెన్నొ' గా చదవగలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి