3, ఏప్రిల్ 2009, శుక్రవారం

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


బ్లాగ్మిత్రులందరికి.. ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

ఆదర్శ దంపతులు...శ్రీ సీతా రాములు మనందరిని చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ...
సరదాగా రాసిన కొన్ని పద్యాలు...
సోదర సోదరీ మణులూ.. కోపగించుకోకండి.. సరదాగా రాసిన్వే.. అవధరించండి..

కం:
విల్లును విరిచావట ఆ
తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !!
చెల్లెను ఆ పనులపుడే
వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్‌ ?

మంటల దింపితి వామెను
అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్‌
మంటలు మా పాలి ఇపుడు
కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్‌

అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడుసుగ మాటొకటను ఇపు
డు డమరములు మోగు నయ్య డస్సును చెవుల్‌ !!
(రాఘవ గారి చూపిన తప్పులు దిద్ది ఈ పద్యముని తిరిగి రాయడమయినది. ఆయనకు ధన్యవాదములు)

అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడసరి మాటన చెలితో
డ డమరములు రేగునయ్య ఢస్సును చెవుల్‌ !!


కంటకుడెత్తుకు పోగా
ఒంటరిగక్కడ వగచెను ఓరిమి గలదై
ఇంటిని వదిలిన గంటకు
కంటికి కనరావటంచు కరకుగ మోగున్‌ !! (ఫోను )

ఓజిమాండియస్ -- అనువాద పద్య కవిత -- కందం

కలిసితి నేపద చారిని
పలికెను అతనీ విధమున పరికించండీ
"కలిసితి నొకబొంది విరిగి
నిలకడగ శిలన మలవగ నిలిచిన కాళ్ళన్‌

సగ భాగమిసుక తినగా
పగిలిన శిల్పపు పలుకులు పలు తావులలో
తెగిపడిన తలన ఇంకను
అగుపడె గర్వము పగిలిన అధరపు ముఖమున్‌

ఘనుడా చెక్కిన శిల్పియె
అనుమాన మొకింత లేదు అతని కళలో
కనులెదుట నిల్పె రాజును
కనికర మెరుగని విధికది కలిసెను మట్టిన్‌

ప్రక్కన నిలిచిన ఫలకము
ముక్కలు గాకయె మిగిలెను మోయుచు చరితన్‌
అక్కడ రాసిన రాతలు
గ్రక్కుతు నిలిచె స్థిరముగ గర్వము నంతన్

"నే రాజుల్లో రాజును
నే రా జొజిమానుడియసు నేజేసినవే
రారాజూ చేసెరుగడు
తారాధిపుని వలె జగతి తా జూచునులే "

అటునిటు నేమియు లేదే ?
కటువగు కాలము, పగిలిన కఠినపు శిలలూ
ఎటు చూసిననూ తరగని
తటమెరు గని ఇసు కదిబ్బ తపనన కంటే !!!

మూలం:


Ozymandias -- By Percy Bysshe Shelley

I met a traveller from an antique land
Who said: "Two vast and trunkless legs of stone
Stand in the desert. Near them on the sand,
Half sunk, a shattered visage lies, whose frown
And wrinkled lip and sneer of cold command
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them and the heart that fed.
And on the pedestal these words appear:
`My name is Ozymandias, King of Kings:
Look on my works, ye mighty, and despair!'
Nothing beside remains. Round the decay
Of that colossal wreck, boundless and bare,
The lone and level sands stretch far away.

26, మార్చి 2009, గురువారం

విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.అయ్యా విరోధి గారూ
తయ్యారా మీరు మమ్ము తడపగ సుఖమున్‌
వయ్యా రి వసంత మెపుడొ
వుయ్యాలలొ ఊపెమమ్ము ఉబలాటంగా


నూతన వత్సరమును మన
వేతలు దీర్చ మని, లోని వేదన దీయన్
చేతల ఆశలు నింపగ
పూతలు పాదములజల్లి పూజించెదనే

25, మార్చి 2009, బుధవారం

పాపం భూశ్రీపతి బ్రహ్మ పిత

జడమాతని మొదటిది నిల
కడెరుగదా రెండవ సతి కడలి నివాసం
పడకేమో బుసల నడుమ
కొడుకా పలుతలల వాడు కొరుకుడు పడడా ?

పక్షుల పైగద పయనము
రక్షణ అతనెరుగడు నింగి రయమున బోవన్‌
కుక్షిన అఖిల జగతి గదా !
నక్షత్రములగు పడునేమొ నడిచెడి సమయం

పాపము ఎన్ని ఇడుములో
మాపగ మన పాపములను మాటలు పడుతూ
కోపము చూపక ఆతని
లోపాలను తన ఉదరపు లోతుల దాచున్‌

ఎప్పుడూ సమస్యా పూరణల లేనా..--...ణరపూ స్యామస ...

కాస్త వైవిధ్యం చూపుదామా ?

పూరణ నిస్తున్నాను.. అర్ధము తెలిసి.. సందర్భాన్ని, సమస్యను వెదకండి.

సమస్యా పూరణం కాదిది సమాధాన శోధనం


కం:
అంజని కాల్బడ రాముడు
రంజిలె సీతమ నమందు రక్షకుడ తడనన్
అంజలి ఘటించె హరి యరి
భంజకుడతనని వగచెను భయమును బొందెన్‌


 ఇది ణరపూ స్యామస ... అన్న మాట :-)

23, మార్చి 2009, సోమవారం

ఆక్రోశంప్రార్ధన చేసితి సతతమ
భ్యర్ధన జేసితి విడువక భక్తితొ పదముల్‌
వ్యర్ధము లాయెగ పూజలు
శ్రార్ధము చేయమనె ఆశ శాశ్వత పధికై

వక్రించిన గతి దీర్చగ
చక్రమునంపెగ గజేశు చరణము గావన్‌
సక్రమ మగునా ఆశను
విక్రముడవవేల ? కావ విజయము జేయవ్‌ ?

చిద్రములయ్యెను నా నిశి
నిద్రనగూడ నినుగొల్వ నీరజ నయనా
భద్రమె నీ సతి సుతులు ద
రిద్రపు బాధేల నీకు రిపుజన శరణా

ఏకృతి నొదిలక పాడితి
ఆకృతి నిల్పితిగనేను ఆత్మన శుచిగా
నిష్కృతి లేదుతమరికిక
సత్కృతులునెరప నెరుగవు సత్యము చెప్పన్‌

విద్యార్ధి గనేర్చిన ఆ
పద్యార్ధములన్ని బోసి పదములు బడితిన్‌
అధ్యాయములెన్నొ జదివి
నుద్యాపనలు నెరపితిని నొచ్చే మిగిలెన్‌

నిర్భయముగ నే నుంటిని
అర్భకుడై నా విడిదిన ఆడెదవనుచున్‌
దర్భల ముడి వేలికిడితె
దుర్భరమయ్యె గద నామ దుప్పెన రేగన్‌

సిరినడ గను అది నీ సతి
విరులడగనదామె సొత్తు విద్యయు అడగన్‌
తిరిపెము ఎత్తితిగ నలుసు
కొరకై తీర్చగ సమయపు కొరతా భగవన్‌ ?

ఆర్తత్రాణుండేడీ ?
కీర్తి శిఖరి పై సతతము క్రీడే వాడే
ధర్తి మడుగు దాగెనొగద
ఆర్తి పిలుపులను వినకనె ఆదను మరచెన్‌

శరణము పలికిన మనిషికి
సరళము సంసా రమంచు సత్యము గనరే ?
గరళము తానే తాగెను
మరణము కాస్తలొ మరలెను మనకేం చేయున్‌

శిక్షనుబ డసితి బ్రతుకున
అక్షయం బగుపా పమేదొ ఆర్జిం చితినే
బిక్షగ అడిగినా నొసగడు
రక్షకుడని పిలవ నతడిని రప్పగ జూతున్‌

దుష్కార్యము జేసితి గద
నిష్కారణము గనె విభుని నిందించితినే !
నిష్కంటకముగ నిలిచి  మ
స్తిష్కంబున నన్ను గావు  సరసిజ నయనా

నిబ్బర ముడిగితి భగవన్‌
దెబ్బల తగిలిన మనసుతొ దెప్పితి నినునే
నబ్బా తిట్టితి ! కరుణతొ
సిబ్బందిని పంప కయ్య శిక్షింప ననున్‌
19, మార్చి 2009, గురువారం

చక్కర్లు కొట్టిస్తున్న వృత్తాలు


పరమేశ్వర స్వరూపమైనా బ్లాగ్సభకి వందనం !


ఊదం గారు నిన్న నాకు వారి బ్లాగులో కందంలో ఇంకెన్నాళ్ళు
ఇతర వృత్తాలను నేర్చుకోవచ్చుగా అంటూ రాకేస్వర రావు గారి
బ్లాగుకు దారి చూపారు.

చంపక మాల, ఉత్పల మాలల గురించె వారు చాలా బాగా వివరణ
ఇచ్చారు. కానీ.. నిన్నటి నుంచి తన్నుకున్నా.. ఏ వృత్తంలోనూ ఒక్క పాదం
కూడా రాయలేక పోయాను. ఎందుకో కందం అవలీలగానూ ఆశువుగానూ
రాయగలుగుతున్నాను... ఉదా:

అందం బ్లాగును చూసితి
అందలి చందపు మెళుకువ అద్దితి మదిలో
మందపు బుర్రే వృత్తపు
చందున శ్రీకా రమయిన చెప్పదు చూడన్‌ !!

కందంలో రాయగలిగితేనే కవి అని..కందానికి అంత పెద్ద ప్రచారం ఉంది కదా..
కందం తప్ప ఏమీ రాయలేని నాలాంటి వాడినేమనాలో ? మీ దయవల్ల అదైనా
రాయగలుగుతున్నాను. ధన్యవాదాలు.

ఇవి రాయడానికి, రాయాలన్న తపన కాక ఇంకేమయినా కావాలా ?
పెద్దలు నాకు కాస్త మార్గ దర్శన చేయగలరు.

16, మార్చి 2009, సోమవారం

సమర్పణ
కొలిచితి నే పరమేశుని
పిలిచిన నా పెదవులరిగె పిలిచీ పిలిచీ
తలపున నిలిపితి నతనిని
తల కోవెలగా మలచితి తన్మయ మందీ

తుడిచితి నాతని పదములు
కడవలు నిండిన జలములు కన్నుల గారన్‌
వడివడి కరిని బ్రోవు వి
భుడొకింత కరుణనుజూపి భువికి దిగడే?

కరుణా మయుడని జెప్పిరి
పరుగున వచ్చునని కూడ పలికిరి పిలవన్‌
కరములు మోడ్చితి పిలిచితి
కరగడు కనికరము కలిగి కదలడు కావన్‌

ఓర్చితి బాధల నెన్నియొ
కూర్చితి గద అశృ కవితల కుసుమము లెన్నో
చేర్చితి కరములు ఒకటిగ
నేర్చితి నీవే విభుడని నే దాసుడనిన్‌

ఎరిగితి గద నీ గొప్పలు
కరిగిన నా మనసు తమరికర్పించితిగా ?
దొరికిన వాహన మెక్కుము
దరి జేరుము వడిగ గావ ధరణీ నాధా !!

10, మార్చి 2009, మంగళవారం

పల్లె సాయంత్రం -- చివరి భాగం


ఇల్లొది లిన ఆకర ణం
పిల్ల, అలిగిన మునసబు పెళ్ళాము గోడు
తల్లిని గొట్టిన కొడుకులు
కల్లుగు డిసెలో నదాగి కలిసిన అయ్యా

వదలని లాకుల కధనం
కదలని అల్లుని ఘనతలు కరగని అప్పున్‌
చెదిరిన కూతురు పెళ్ళియు
బెదిరిం పులసె ట్టిమాపు బకాయి కోసం

గాదెలొ ఎలుకల బాధలు
వీధిలొ వెలుగుట మరిచిన విరిగిన దీపం
సోదిలొ వచ్చిన తాతలు
రోదన మిగిలిన మరదలి రోకటి పోరూ

ఈవిధి ఒకటా రెండా
కోవిదు లుగదమ రి అచట కొల్వగు వారున్‌
వావివ రుసలుగ లుపుదురు
జీవిత పాఠము లునేర్పు జీవులు వారే

తీర్పులు జెప్పుదు రక్కడ
నేర్పుగ పలుకుతు జనులకు నేర్పుతు నీతిన్‌
ఓర్పుగ జేరిన పెద్దలు
చేర్పులు జేతురు నడవడి చేరిన సభలో

పల్లెలు వెనకన వదులుతు
కొల్లలు గయువత నగరపు కొలువులు జేరీ
మెల్లగ మరవగ, పల్లెలు
చిల్లర పెంకుల బరువుకు చిత్తయె నకటా

మోడయి మిగిలిన కూడలి
బీడయె నాకూ డలిసభ బీదగ జూస్తూ
తోడయె మేకలు కుక్కలు
ఆడకు చెప్పగ తమతమ ఆకలి అరుపున్‌

5, మార్చి 2009, గురువారం

పల్లె సాయంత్రం -- మొదటి భాగం


పల్లెన ఓసాయంత్రం
చల్లని వాతావరణము చర్చల సమయం
అల్లరి పిల్లల పరుగులు
మెల్లగ గుమిగూడు ఊరి మిగిలిన వారున్‌

చర్చకు అంటూ గుడిలో
అర్చన ముగియగ అక్కడ ఆగిన అయ్యా
ఖర్చుల లెక్కలు తేలగ
వచ్చిన సొమ్మును బిగించి వణికుడు సెట్టీ

దుక్కిని దున్నగ అలసియు
ఎక్కిన బండీ నొదిలిక ఎడ్లను కడుతూ
అక్కడ జేరిన వారిని
ఒక్కరి నొదలక అడిగిన ఓరిమి రైతూ

రాజా ధిరాజు నంటూ
బాజా లూదే జనాలు బరువై పోగా
లూజుగ అంగీ తొడిగిన
జాజుల రాయుడు కరణము జాతర గొచ్చే

పిలుపులు అందిన కొందరు
పిలవక నేచే రుజనులు పిలుపుల వారూ
తలపని కొచ్చిన వారూ
తలవక నేజే రువారు తలమున్గోరూ
పకపక లాడుతు కొందరు
తికమక పడుతూ జనులను తిట్టే వారూ
ఒకమా టవినం డంటూ
ఇక ఇటు నేరా ననుచునె ఎగిరే వారూ

పట్టా లుమరిచి ఇంజను
చుట్టా లనుజూ డ ఆగి చూసిన రీతిన్‌
చుట్టెట్టి నోటి లొపొగలు
చుట్టూ రాఊదెవారు చూస్తుం డంగా

ఇక చుక్కే సేవారూ
ఒక పెగ్గే అనుచునె ఓపీపాలే
పుకదులు కుండలు, చివరగ
నొకమూ లపొరలు తుమత్తు నొదలని వారూ

జాతర గదవా రిసభలు
ఖాతరు చేయరుగ ఇంటి కాంతల పిలుపే
చేతులు అస్సలు కదలవు
కోతలు మాత్రం దుముకును కోటలు ఎన్నో


(సశేషం .. )

జులాయి - కందం
చల్లని ఓ సాయంత్రం
మల్లెలు జడన దురిమినొక మగువను జూస్తూ
మెల్లగ మాటాడ బోతిని
నల్లని తనకన్ను గీటి నిలకడ నిలవన్‌

చెంతకు పోగా నవ్వుచు
వింతగ నన్నామె చూస్తు వివరము అడిగీ
దొంతరులుగ నవ్వి పలుక
చింత పులుపు టెంకె నోటి చివరకు తోసెన్‌ !!

తెల్లని కన్నుల చిన్నది
చల్లని చెక్కిలి మెరవగ చవులూరిస్తూ
మెల్లగ నోరాడించగ
వెల్లువ కాగా తపనలు వెళ్ళితి దరికిన్‌

మెల్లగ జేరి తనకడకు
తెల్లని నా పలువరసను తెల్లము జేస్తూ
సెల్లుని ఆపిన ఆమెను
ఉల్లము చల్ల బడగ గంటి ఉస్సూరంటూ !!

3, మార్చి 2009, మంగళవారం

పలుకులు బంగా రమయెగపలుకులు బంగా రమయెగ
చిలకగ బాధలు యెడదన చెలమలు నిండన్‌
చెలి కిను కొదలక పలకక
కలవర తలొన న్నుముంచె కనికర మొదిలెన్‌

పదముల బడితిని చివరకు
యెదగా నమువిన్నవించి యర్ధించితినే
కదలక ఉన్నను చివరకు
మదికర గగనా తొపలికె మధువులు ఒలకన్‌

అధరము లొలికిన పదములు
మధురము గమదిని తగిలెగ మల్లెల రీతిన్‌
మధనము చీకటి వీడెను
ఉదయపు వెలుగులు ఇమిడెను హృదయము నిండా

25, ఫిబ్రవరి 2009, బుధవారం

కలమది తలుపులు తీసిన కల
యది గదిగో కనుల వెనక ఎగిరెను కధగా
అది ఆడె నిదుర చివరన
పదిలం గాతా టి చివర పతంగు లాగా

మెరిసిన కలేల నిలవదు ?
కురిసిన వానవ లెజేరు కలతల పల్లం
మురిపిం చినకలొ కటైన
మరుగవ కమిగుల కలతలె మిగులును అకటా

గతమొక కలయని జెప్పిరి
పితలా టకమిపు డువచ్చె పిలవక వచ్చే
కతలతొ నిదురా విరయెను
చితుకుల యికనులు వెలుగెను చింతలు పెరిగే

18, ఫిబ్రవరి 2009, బుధవారం

ఆశలు

పగ్గములు ఎరుగనాశల
మగ్గము లొలికిన వలువలు మనసుకు తొడిగీ
బుగ్గవగవి గుండె చెదిరె
నొగ్గితి నాతలనజునకు నొప్పక గాయం

ఆశలు జారెను భూమికి
ఈశుని జటలకు ఉరికిన ఈప్సిత జలగా
నాశము చెందిరి మనుషులు
లేశపు మాత్రపు పటిమయు లేకనె ఇలలో‌

9, ఫిబ్రవరి 2009, సోమవారం

వేదన

అడగక ఎగబడు అలెపుడు
కడలిని వదలని విధముగ, కనులలొ తిరిగే
వడలని మన చెలిమి తలపు ,
కడవరకు నను విడదనెద కధ ఇది కాదే

తడి ఆరని నా చెంపకు
కడు అందమమరె చివరకు కడలి తటము లా
కొడిగట్టిన కంటి ఎరుపు,
పడిలేచే కెరటములట పడమటి చూపూ

పద పద మనవెద పలుకులు
మధువొల కనిపద సుధలును మనకధ కనుకే
వదలక వదరెడి నలతలు,
మెదలని పెదవులు, విరుగుడు మనసుకు ఎపుడో

సమస్యాపూరణము

పరవశమునాట లాడెడి
పరమాత్మల చంకనెత్తి పడకకు జనగా
పరతన బేధము లెరగక
పరమ శివుని తోడ లక్ష్మి పవళించెనయా!

పరమ సాధ్వి అనసూయ త్రిమూర్తులను పిల్లలుగా చేసినప్పుడు
వారిని తిరిగి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వారి పత్నులు పడిన హడావిడి
లో చేతికందిన పిల్లగాడిని వెంట తీసుకెళ్ళారు అని చెప్ప దలిచాను.
నాల్గవ పాదం.. కందానికి సరిపోక కాస్త మార్చాను .

చింతా రామకృష్ణారావుగారు ఇచ్చిన సమస్యకు నా పూరణ.

http://andhraamrutham.blogspot.com/2009/02/1.html


======================================================


"పైకము, పదవులు చాలక
శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
మైకున అరచిరి ఓటిడ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!" అనండి.


డా.ఆచార్య ఫణీంద్ర గారు ఇచ్చిన సమస్యకు పూరణ - ఫణీంద్ర గారికి ధన్యవాదాలు. తప్పులను దిద్దినందుకు
http://dracharyaphaneendra.blogspot.com/2009/02/blog-post_06.html

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

కంద పప్పులో కాలేసి భీభత్సం చేసిన పదో రసం

నవరసములంటు బాగుగ
నవ కవితల నే లిఖింప ! నకటా... కంటే !!
నవరసముల పై నొక రస
మవపడె నది భీభతిసయమయెగా నిజమే ?

పెద్దలు చెపుదురు , నాతల ,
మద్దెల బాదుడు, తలంటు, మంగలి పనికో,
పెద్దగ కనబడుట కొరకొ,
నద్దము కడ సవరణలకొ , నున్నది. దయతో !!

నవ రసాల పేర్లు: శృంగారం హాస్యం కరుణ వీరం శాంతం భక్తి భయానకం రౌద్రం అద్భుతం భీబత్సం
మరి ఇవి పది గదా ? నేనెక్కడ ఈ కాలేశాను ?

5, ఫిబ్రవరి 2009, గురువారం

నవరసాలు - రౌద్రం

కం:
కార్గిలు సీమన సేనలు
భార్గవులయి కోసె తలలు బాధల కోర్చీ
మార్గము మరిచి ఖలులు శర
ణార్గతి కోరిరి భయమున నాశము చూస్తూ

కం:
బొంబయి నగరము లోజగ
డంబయె ముష్కరు లతోడ ! డక్కును విడి బం
ధంబుపడి వారి పనులకు
డంబము నిలిపెగ నతండు ధన్యత నొందే

4, ఫిబ్రవరి 2009, బుధవారం

సమస్యా పూరణం

కం:
కాముడు రావణ హతకుడు
కోమలి తోడగు గణముల కోతులు అనగా
రాముడె నందుని సుతుడవ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్‌

రాముడిని మోహించిన వానరులకు ఒక వరమిచ్చాడనీ,
వారే పదహారు వేల గోపికలయ్యారన్న కధ ఉంది.
ఆసందర్భ్హాన్ని ఆధారంగా చిన్న ప్రయత్నం

కం:
పదమనె సిరిపతి పత్నితొ
పదవులు ఊడిన సురగణ పరపతి నిలుపా
కదలని సిరితో పలికెను
"ముదమగు నొక సుతయు వేయి యల్లుళ్ళున్నన్‌ "!

భూమిని లక్ష్మీ నారాయణుల సుత గానూ
రాజు భూపతి కనక, పదవులు ఊడిన రాజులను
వారి అల్లుళ్ళుగానూ పోలిక చేయటానికి ప్రయత్నించాను.

పెద్దలు తప్పులను దిద్ద గలరు

http://turupumukka.blogspot.com/2009/02/blog-post.html గారు ఇచ్చిన రెండు సమస్యలకు పూరణ.

నవరసాలు - అద్భుతం


కం:
కనకపు పట్టము బడసిన
మన నేతలు మనని మరచి మసలుట చూసీ
తన జనుల కాయు కుక్కలు
మనమా వీడితొ సమమని మనసున వగచే !!
!

కం:
వగచిన తీరును పాపము
పగవాడు నిజము హితుడగు పదములు బడగా
నగుమోము విడని నేతకు
తెగ జేసిననూ ఒలకదు తిరిపెము కూడా

3, ఫిబ్రవరి 2009, మంగళవారం

నవరసాలు - భయానకం

పదవులె వారికి తెలియును
పదుగురు కిచ్చిన పలుకులు పరపతి కోసం
కదలిరి దేశము నేలగ
చెదవలె పాకుతు దిశలకు చెయ్యగ నాశం

సత్యము లస్సలు పలకరు
హత్యలు పలుజే సిరంట హతవిధి ఇలలో
భత్యము చాలక నేతలు
నిత్యము అవినీతి మరిగె నిక్కము కంటే

నవరసాలు - భక్తి

సమసిన ఆశల దీపము
సమయము ఆగక సలిపెను సమరము నపుడే
సమయో చితమ్ము నెరుగక
సమర్ప ణతమకు నొసగితి సరసిజ నయనా !!

దరిచూపుము ననుగావుము
పరిపాలకుడవనినమ్మి పలికితి శరణం
కరిగాచిన విభుడవు కని
కరమున కావుము తనయుని కమలదళాక్షా !!

31, జనవరి 2009, శనివారం

నవరసాలు - శాంతం
నిప్పులు కురుసెడి కన్నులు
చప్పున మండెడి పలుకుల చపలగు భార్యా
అప్పుడు తప్పులు పట్టక
తప్పించుకు తిరిగి చూడు తగువులు మాయం

తనతో సరసము లాడుతు
తనచే కుడితికి మధువును తగదని పేల్చీ
తనవారు ఘనులని తెలుపు
మనకిట శాంతము దొరుకును మాపుకి మోక్షం

30, జనవరి 2009, శుక్రవారం

నవరసాలు - కరుణ

చెరగదు విరహము ఎదలో
కరగదు ప్రేయసి ఎడదయు కన్నీటి సుధలో
మరువగ నామది ఈకధ
మరణము పిలిచిన కదలదు ముక్తిక ఎపుడో

చెలిమిని గోరితి నేనని
చెలి పలికిన పలుకులు విన పడగా
చెలమలు రేగగ కనులం‌
జలి ఘటించెచు వగచి అలిసెను చెలియా

నెచ్చెలి పిలవగ ఈతరి
వచ్చితి చలిలో నిపుడు వగచుచు తనకై
వెచ్చటి పగలును వదిలి
పిచ్చేమి ఇపుడిటు పిలవగ పలకవె చిలకా
నవరసాలు - వీరం
రగిలిన నాచెలి కోపము
తగదనినస్సలు వినదుగ తగువుల కోరై
దిగులేల పడుదు నిప్పుడు
దిగితిని గదపీకవరకు దిక్కులు చూస్తూ

తాండవ మాడెను నాసఖి
భాండము లన్నియు పగలగ భయమును వీడీ
దండము లెన్నియొ దీసిన
భాండము నాపై పులిమితి బాధ్యత నెరిగీ

నవరసాలు - హాస్యం

పరిచిన వెన్నెల తోటన
విరిసిన కలువటు పిలవగ విరహము రేగీ
మెరిసిన కన్నుల వెలుగున
పరువము గ్రోలగ పరుగిడి పడితిని తెలుసా !!

జున్నును తినంగ గోరితి
కన్నులు నిండెను మిరియపు కఠినత తోడై
కన్నును గీటిన చిన్నది
వెన్నుని జూపిన విధమున వినవే కఠినా

29, జనవరి 2009, గురువారం

నవరసాలు - శృంగారంఇటు తిరుగంగొక బింబము
అటుతారాధిపు లిరువురు ఆదరి తిరగన్‌
అటునిటు నేమని తెలుపను
వ్వెటు తిరిగిన చెదిరె ఎద సఖియా

శిగలో మల్లెలు దురిమి
పగడపు మెరుపులు గలిగిన పెదవులు జూపీ
మగతను, మన్మధుడిచ్చిన
సెగలతొ ఇలనీ విధమగ సేయకు లలనా


ఊదం గారికి ధన్యవాదాలతో !!


తప్పులను పెద్దలు దిద్దగలరని నా ఆకాంక్ష ఆ ఆశతోనే ఈ చిన్న ప్రయత్నం. ఏదో నా మిడిమిడి పాండిత్యంతో తాతల ముందు దగ్గుతున్నాను.

26, జనవరి 2009, సోమవారం

గొంతు దిగని కందం

కందము వ్రాయగ బూనితి
అందముగానుండు రీతి అందరు వినగా
ఇందలి ప్రాసయు ఈ యతి
మందము పట్టిన మెదడుకు చిక్కగ రాదే ?

కొరకగ నవ్వదు కందము
పరుషంగా తగులు జిహ్వ పచ్చడి విధమున్‌
పరువాల పడతి నొదలక
పరివిధముల సాకు నతనిల పడెనే నకటా !!

తడబడు అడుగుల బుడతను
మిడిమిడి తెలివిన గెలికిన పదములు పరచితి
గడగడ భయపడి వణుకుతు
గడవని కలమును జరిపితి గణములు కుదరన్‌

12, జనవరి 2009, సోమవారం

నమస్సులు

పెద్దలందరికి నమస్సులు

తెలుగులో పద్యాలు రాయాలన్న తపన బాగా పెరగడంతో
పెద్దలు బ్లాగుల్లో రాస్తున్న పద్యాలను చదివి ఆనదించి స్పందించి. నేను కూడా మరోబ్లాగు పెట్టి అందులో
చిన్న చిన్నగా కంద పద్యాలు రాయాలన్న ఆశ నాచేత ఈ బ్లాగు చేయించింది.

నా తప్పులు సరి దిద్దుతారని, ఆశిస్తున్నాను.