3, ఏప్రిల్ 2009, శుక్రవారం

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


బ్లాగ్మిత్రులందరికి.. ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

ఆదర్శ దంపతులు...శ్రీ సీతా రాములు మనందరిని చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ...
సరదాగా రాసిన కొన్ని పద్యాలు...
సోదర సోదరీ మణులూ.. కోపగించుకోకండి.. సరదాగా రాసిన్వే.. అవధరించండి..

కం:
విల్లును విరిచావట ఆ
తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !!
చెల్లెను ఆ పనులపుడే
వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్‌ ?

మంటల దింపితి వామెను
అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్‌
మంటలు మా పాలి ఇపుడు
కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్‌

అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడుసుగ మాటొకటను ఇపు
డు డమరములు మోగు నయ్య డస్సును చెవుల్‌ !!
(రాఘవ గారి చూపిన తప్పులు దిద్ది ఈ పద్యముని తిరిగి రాయడమయినది. ఆయనకు ధన్యవాదములు)

అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడసరి మాటన చెలితో
డ డమరములు రేగునయ్య ఢస్సును చెవుల్‌ !!


కంటకుడెత్తుకు పోగా
ఒంటరిగక్కడ వగచెను ఓరిమి గలదై
ఇంటిని వదిలిన గంటకు
కంటికి కనరావటంచు కరకుగ మోగున్‌ !! (ఫోను )

ఓజిమాండియస్ -- అనువాద పద్య కవిత -- కందం

కలిసితి నేపద చారిని
పలికెను అతనీ విధమున పరికించండీ
"కలిసితి నొకబొంది విరిగి
నిలకడగ శిలన మలవగ నిలిచిన కాళ్ళన్‌

సగ భాగమిసుక తినగా
పగిలిన శిల్పపు పలుకులు పలు తావులలో
తెగిపడిన తలన ఇంకను
అగుపడె గర్వము పగిలిన అధరపు ముఖమున్‌

ఘనుడా చెక్కిన శిల్పియె
అనుమాన మొకింత లేదు అతని కళలో
కనులెదుట నిల్పె రాజును
కనికర మెరుగని విధికది కలిసెను మట్టిన్‌

ప్రక్కన నిలిచిన ఫలకము
ముక్కలు గాకయె మిగిలెను మోయుచు చరితన్‌
అక్కడ రాసిన రాతలు
గ్రక్కుతు నిలిచె స్థిరముగ గర్వము నంతన్

"నే రాజుల్లో రాజును
నే రా జొజిమానుడియసు నేజేసినవే
రారాజూ చేసెరుగడు
తారాధిపుని వలె జగతి తా జూచునులే "

అటునిటు నేమియు లేదే ?
కటువగు కాలము, పగిలిన కఠినపు శిలలూ
ఎటు చూసిననూ తరగని
తటమెరు గని ఇసు కదిబ్బ తపనన కంటే !!!

మూలం:


Ozymandias -- By Percy Bysshe Shelley

I met a traveller from an antique land
Who said: "Two vast and trunkless legs of stone
Stand in the desert. Near them on the sand,
Half sunk, a shattered visage lies, whose frown
And wrinkled lip and sneer of cold command
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them and the heart that fed.
And on the pedestal these words appear:
`My name is Ozymandias, King of Kings:
Look on my works, ye mighty, and despair!'
Nothing beside remains. Round the decay
Of that colossal wreck, boundless and bare,
The lone and level sands stretch far away.

26, మార్చి 2009, గురువారం

విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.



అయ్యా విరోధి గారూ
తయ్యారా మీరు మమ్ము తడపగ సుఖమున్‌
వయ్యా రి వసంత మెపుడొ
వుయ్యాలలొ ఊపెమమ్ము ఉబలాటంగా


నూతన వత్సరమును మన
వేతలు దీర్చ మని, లోని వేదన దీయన్
చేతల ఆశలు నింపగ
పూతలు పాదములజల్లి పూజించెదనే

25, మార్చి 2009, బుధవారం

పాపం భూశ్రీపతి బ్రహ్మ పిత

జడమాతని మొదటిది నిల
కడెరుగదా రెండవ సతి కడలి నివాసం
పడకేమో బుసల నడుమ
కొడుకా పలుతలల వాడు కొరుకుడు పడడా ?

పక్షుల పైగద పయనము
రక్షణ అతనెరుగడు నింగి రయమున బోవన్‌
కుక్షిన అఖిల జగతి గదా !
నక్షత్రములగు పడునేమొ నడిచెడి సమయం

పాపము ఎన్ని ఇడుములో
మాపగ మన పాపములను మాటలు పడుతూ
కోపము చూపక ఆతని
లోపాలను తన ఉదరపు లోతుల దాచున్‌

ఎప్పుడూ సమస్యా పూరణల లేనా..--...ణరపూ స్యామస ...

కాస్త వైవిధ్యం చూపుదామా ?

పూరణ నిస్తున్నాను.. అర్ధము తెలిసి.. సందర్భాన్ని, సమస్యను వెదకండి.

సమస్యా పూరణం కాదిది సమాధాన శోధనం


కం:
అంజని కాల్బడ రాముడు
రంజిలె సీతమ నమందు రక్షకుడ తడనన్
అంజలి ఘటించె హరి యరి
భంజకుడతనని వగచెను భయమును బొందెన్‌


 ఇది ణరపూ స్యామస ... అన్న మాట :-)

23, మార్చి 2009, సోమవారం

ఆక్రోశం



ప్రార్ధన చేసితి సతతమ
భ్యర్ధన జేసితి విడువక భక్తితొ పదముల్‌
వ్యర్ధము లాయెగ పూజలు
శ్రార్ధము చేయమనె ఆశ శాశ్వత పధికై

వక్రించిన గతి దీర్చగ
చక్రమునంపెగ గజేశు చరణము గావన్‌
సక్రమ మగునా ఆశను
విక్రముడవవేల ? కావ విజయము జేయవ్‌ ?

చిద్రములయ్యెను నా నిశి
నిద్రనగూడ నినుగొల్వ నీరజ నయనా
భద్రమె నీ సతి సుతులు ద
రిద్రపు బాధేల నీకు రిపుజన శరణా

ఏకృతి నొదిలక పాడితి
ఆకృతి నిల్పితిగనేను ఆత్మన శుచిగా
నిష్కృతి లేదుతమరికిక
సత్కృతులునెరప నెరుగవు సత్యము చెప్పన్‌

విద్యార్ధి గనేర్చిన ఆ
పద్యార్ధములన్ని బోసి పదములు బడితిన్‌
అధ్యాయములెన్నొ జదివి
నుద్యాపనలు నెరపితిని నొచ్చే మిగిలెన్‌

నిర్భయముగ నే నుంటిని
అర్భకుడై నా విడిదిన ఆడెదవనుచున్‌
దర్భల ముడి వేలికిడితె
దుర్భరమయ్యె గద నామ దుప్పెన రేగన్‌

సిరినడ గను అది నీ సతి
విరులడగనదామె సొత్తు విద్యయు అడగన్‌
తిరిపెము ఎత్తితిగ నలుసు
కొరకై తీర్చగ సమయపు కొరతా భగవన్‌ ?

ఆర్తత్రాణుండేడీ ?
కీర్తి శిఖరి పై సతతము క్రీడే వాడే
ధర్తి మడుగు దాగెనొగద
ఆర్తి పిలుపులను వినకనె ఆదను మరచెన్‌

శరణము పలికిన మనిషికి
సరళము సంసా రమంచు సత్యము గనరే ?
గరళము తానే తాగెను
మరణము కాస్తలొ మరలెను మనకేం చేయున్‌

శిక్షనుబ డసితి బ్రతుకున
అక్షయం బగుపా పమేదొ ఆర్జిం చితినే
బిక్షగ అడిగినా నొసగడు
రక్షకుడని పిలవ నతడిని రప్పగ జూతున్‌

దుష్కార్యము జేసితి గద
నిష్కారణము గనె విభుని నిందించితినే !
నిష్కంటకముగ నిలిచి  మ
స్తిష్కంబున నన్ను గావు  సరసిజ నయనా

నిబ్బర ముడిగితి భగవన్‌
దెబ్బల తగిలిన మనసుతొ దెప్పితి నినునే
నబ్బా తిట్టితి ! కరుణతొ
సిబ్బందిని పంప కయ్య శిక్షింప ననున్‌




19, మార్చి 2009, గురువారం

చక్కర్లు కొట్టిస్తున్న వృత్తాలు


పరమేశ్వర స్వరూపమైనా బ్లాగ్సభకి వందనం !


ఊదం గారు నిన్న నాకు వారి బ్లాగులో కందంలో ఇంకెన్నాళ్ళు
ఇతర వృత్తాలను నేర్చుకోవచ్చుగా అంటూ రాకేస్వర రావు గారి
బ్లాగుకు దారి చూపారు.

చంపక మాల, ఉత్పల మాలల గురించె వారు చాలా బాగా వివరణ
ఇచ్చారు. కానీ.. నిన్నటి నుంచి తన్నుకున్నా.. ఏ వృత్తంలోనూ ఒక్క పాదం
కూడా రాయలేక పోయాను. ఎందుకో కందం అవలీలగానూ ఆశువుగానూ
రాయగలుగుతున్నాను... ఉదా:

అందం బ్లాగును చూసితి
అందలి చందపు మెళుకువ అద్దితి మదిలో
మందపు బుర్రే వృత్తపు
చందున శ్రీకా రమయిన చెప్పదు చూడన్‌ !!

కందంలో రాయగలిగితేనే కవి అని..కందానికి అంత పెద్ద ప్రచారం ఉంది కదా..
కందం తప్ప ఏమీ రాయలేని నాలాంటి వాడినేమనాలో ? మీ దయవల్ల అదైనా
రాయగలుగుతున్నాను. ధన్యవాదాలు.

ఇవి రాయడానికి, రాయాలన్న తపన కాక ఇంకేమయినా కావాలా ?
పెద్దలు నాకు కాస్త మార్గ దర్శన చేయగలరు.