23, మార్చి 2009, సోమవారం

ఆక్రోశం



ప్రార్ధన చేసితి సతతమ
భ్యర్ధన జేసితి విడువక భక్తితొ పదముల్‌
వ్యర్ధము లాయెగ పూజలు
శ్రార్ధము చేయమనె ఆశ శాశ్వత పధికై

వక్రించిన గతి దీర్చగ
చక్రమునంపెగ గజేశు చరణము గావన్‌
సక్రమ మగునా ఆశను
విక్రముడవవేల ? కావ విజయము జేయవ్‌ ?

చిద్రములయ్యెను నా నిశి
నిద్రనగూడ నినుగొల్వ నీరజ నయనా
భద్రమె నీ సతి సుతులు ద
రిద్రపు బాధేల నీకు రిపుజన శరణా

ఏకృతి నొదిలక పాడితి
ఆకృతి నిల్పితిగనేను ఆత్మన శుచిగా
నిష్కృతి లేదుతమరికిక
సత్కృతులునెరప నెరుగవు సత్యము చెప్పన్‌

విద్యార్ధి గనేర్చిన ఆ
పద్యార్ధములన్ని బోసి పదములు బడితిన్‌
అధ్యాయములెన్నొ జదివి
నుద్యాపనలు నెరపితిని నొచ్చే మిగిలెన్‌

నిర్భయముగ నే నుంటిని
అర్భకుడై నా విడిదిన ఆడెదవనుచున్‌
దర్భల ముడి వేలికిడితె
దుర్భరమయ్యె గద నామ దుప్పెన రేగన్‌

సిరినడ గను అది నీ సతి
విరులడగనదామె సొత్తు విద్యయు అడగన్‌
తిరిపెము ఎత్తితిగ నలుసు
కొరకై తీర్చగ సమయపు కొరతా భగవన్‌ ?

ఆర్తత్రాణుండేడీ ?
కీర్తి శిఖరి పై సతతము క్రీడే వాడే
ధర్తి మడుగు దాగెనొగద
ఆర్తి పిలుపులను వినకనె ఆదను మరచెన్‌

శరణము పలికిన మనిషికి
సరళము సంసా రమంచు సత్యము గనరే ?
గరళము తానే తాగెను
మరణము కాస్తలొ మరలెను మనకేం చేయున్‌

శిక్షనుబ డసితి బ్రతుకున
అక్షయం బగుపా పమేదొ ఆర్జిం చితినే
బిక్షగ అడిగినా నొసగడు
రక్షకుడని పిలవ నతడిని రప్పగ జూతున్‌

దుష్కార్యము జేసితి గద
నిష్కారణము గనె విభుని నిందించితినే !
నిష్కంటకముగ నిలిచి  మ
స్తిష్కంబున నన్ను గావు  సరసిజ నయనా

నిబ్బర ముడిగితి భగవన్‌
దెబ్బల తగిలిన మనసుతొ దెప్పితి నినునే
నబ్బా తిట్టితి ! కరుణతొ
సిబ్బందిని పంప కయ్య శిక్షింప ననున్‌




0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి