16, మార్చి 2009, సోమవారం

సమర్పణ




కొలిచితి నే పరమేశుని
పిలిచిన నా పెదవులరిగె పిలిచీ పిలిచీ
తలపున నిలిపితి నతనిని
తల కోవెలగా మలచితి తన్మయ మందీ

తుడిచితి నాతని పదములు
కడవలు నిండిన జలములు కన్నుల గారన్‌
వడివడి కరిని బ్రోవు వి
భుడొకింత కరుణనుజూపి భువికి దిగడే?

కరుణా మయుడని జెప్పిరి
పరుగున వచ్చునని కూడ పలికిరి పిలవన్‌
కరములు మోడ్చితి పిలిచితి
కరగడు కనికరము కలిగి కదలడు కావన్‌

ఓర్చితి బాధల నెన్నియొ
కూర్చితి గద అశృ కవితల కుసుమము లెన్నో
చేర్చితి కరములు ఒకటిగ
నేర్చితి నీవే విభుడని నే దాసుడనిన్‌

ఎరిగితి గద నీ గొప్పలు
కరిగిన నా మనసు తమరికర్పించితిగా ?
దొరికిన వాహన మెక్కుము
దరి జేరుము వడిగ గావ ధరణీ నాధా !!

3 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అర్పించింది కరిగిన మనసును కదా ! తప్పక వస్తారు ఎళ్ళవేళలా తన సేవకోసమే నిమగ్నమయిన పక్షిరాజాన్నధిరోహించి.

అజ్ఞాత చెప్పారు...

కందపు దొంతరలన్నీ
అందముగాపేర్చి, పిదప అచ్చొత్తించీ
ముందుగ నాకొసగుముప్రతి
సందేహింపకత్వరితమె సన్మిత్రకవీ

ఆత్రేయ కొండూరు చెప్పారు...

నొచ్చిన మనసున రాలిన
చిచ్చులు గదఅవ్వి తెలియ జెప్పితి చింతన్
అచ్చేయ తగవవి అయినను
మెచ్చిన తమరికి నొసగద మొదటి ముద్రన్

ఊదం గారు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి