పరమేశ్వర స్వరూపమైనా బ్లాగ్సభకి వందనం !
ఊదం గారు నిన్న నాకు వారి బ్లాగులో కందంలో ఇంకెన్నాళ్ళు
ఇతర వృత్తాలను నేర్చుకోవచ్చుగా అంటూ రాకేస్వర రావు గారి
బ్లాగుకు దారి చూపారు.
చంపక మాల, ఉత్పల మాలల గురించె వారు చాలా బాగా వివరణ
ఇచ్చారు. కానీ.. నిన్నటి నుంచి తన్నుకున్నా.. ఏ వృత్తంలోనూ ఒక్క పాదం
కూడా రాయలేక పోయాను. ఎందుకో కందం అవలీలగానూ ఆశువుగానూ
రాయగలుగుతున్నాను... ఉదా:
అందం బ్లాగును చూసితి
అందలి చందపు మెళుకువ అద్దితి మదిలో
మందపు బుర్రే వృత్తపు
చందున శ్రీకా రమయిన చెప్పదు చూడన్ !!
కందంలో రాయగలిగితేనే కవి అని..కందానికి అంత పెద్ద ప్రచారం ఉంది కదా..
కందం తప్ప ఏమీ రాయలేని నాలాంటి వాడినేమనాలో ? మీ దయవల్ల అదైనా
రాయగలుగుతున్నాను. ధన్యవాదాలు.
ఇవి రాయడానికి, రాయాలన్న తపన కాక ఇంకేమయినా కావాలా ?
పెద్దలు నాకు కాస్త మార్గ దర్శన చేయగలరు.
4 కామెంట్లు:
హ హ హ.
బానే ఉంది మీ డైలెమా.
కందానికి అన్నీ నాలుగు మాత్రల గణాలు అవడం వల్ల చాలా నిర్దిష్టమైన నడక ఉంది. ఆ నడక స్పష్టంగానో అస్పష్టంగానో మీ మనసులో స్థిరంగా నాటుకుంది గనక కందాలు సులువుగా రాస్తున్నారు.
మిగతా పద్యాలైనా అంతె. వాటికీ నిర్దిష్టమైన నడకలున్నాయి. ఆ నడకని ముందు మనసులో ప్రతిష్ఠించుకోండి. గణాల గురించీ, యతి ప్రాసల గురించీ కాసేపు మరిచిపోండి. ఆ లయకి తగినట్టు మాటల పొంద్క పేర్చుకోండి.
ఏమయ్యా ఆత్రేయ గారు,
ఇప్పుడే గదయ్యా దేవుడెక్కడ చదివింది.ఇంతలోపే కందగడ్డలు తినిపిస్తే ఎలా జీర్ణం చేసుకోవాలి?
పద్యం నడక బాగుంది.
తేలికపాటిమాటలను తీరుగ పేర్చిన వృత్తపాదమౌ
నాలుక పైననిల్చినవి నాలుగు పల్కులె గూర్చుఛందమున్
మేలున ఘంటమున్ గొనుడి మీరిక జూడక మీనమేషముల్
చాలును సంశయాత్మకత చక్కని వృత్తము వ్రాయబూనుడి.
బాగుగచెప్పినారుగద బాధ్యత గల్గిన వానిగా నిజం !!
సాగును జేతువృత్తములు సాధన జేతును వాటినేసదా !!
హమ్మయ్య.. ఫర్లేదు రాయొచ్చు. :-)
ఊదం గారు ధన్యవాదాలు. మీ అసలు పేరు తెలియదు నోరారా ధన్యవాదాలు చెపుదామంటే..
కామెంట్‌ను పోస్ట్ చేయండి