
కొలిచితి నే పరమేశుని
పిలిచిన నా పెదవులరిగె పిలిచీ పిలిచీ
తలపున నిలిపితి నతనిని
తల కోవెలగా మలచితి తన్మయ మందీ
తుడిచితి నాతని పదములు
కడవలు నిండిన జలములు కన్నుల గారన్
వడివడి కరిని బ్రోవు వి
భుడొకింత కరుణనుజూపి భువికి దిగడే?
కరుణా మయుడని జెప్పిరి
పరుగున వచ్చునని కూడ పలికిరి పిలవన్
కరములు మోడ్చితి పిలిచితి
కరగడు కనికరము కలిగి కదలడు కావన్
ఓర్చితి బాధల నెన్నియొ
కూర్చితి గద అశృ కవితల కుసుమము లెన్నో
చేర్చితి కరములు ఒకటిగ
నేర్చితి నీవే విభుడని నే దాసుడనిన్
ఎరిగితి గద నీ గొప్పలు
కరిగిన నా మనసు తమరికర్పించితిగా ?
దొరికిన వాహన మెక్కుము
దరి జేరుము వడిగ గావ ధరణీ నాధా !!





